మన దేశానికి భారత దేశమనే పేరు కలదు. భారత శబ్దానికి అర్థం ఏమిటి?
భారత అనే శబ్దంలో మూడు అక్షరాలు ఉన్నాయి. 'భా' అనే అక్షరానికి ప్రకాశమని, 'ర' అంటే రమించడం అని, 'త' అంటే తరించడం అని అర్థం. జ్ఞాన మార్గంలో రమించి తరించేవాడు భారతీయుడు. అందుకే మన భారతదేశాన్ని 'కర్మభూమి' అని, ఇతర దేశాలను 'భోగభూములని' అంటారు.
కర్మభూమికి భోగభూమికి గల తేడా ఏమిటి?
భారత దేశంలో 'కర్మ' కు ప్రాధాన్యత ఇవ్వబడినది. కర్మను ప్రధానంగా పరిగణించి దానినే ఆచరిస్తూ జీవనం సాగిస్తారు. ఇతర దేశాలలో 'భోగానికే' ప్రాధాన్యత. వాటిని పొందేందుకే వారు జీవనం సాగిస్తారు. కావున ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసముంది.
కర్మ అంటే ఏమిటి?
భారతీయ సంస్కృతిలో జన్మించిన ప్రతి హిందువు వేద శాస్త్రములనే ప్రామాణికంగా భావిస్తాడు. మనిషి మనుగడకై వేద శాస్త్రాలు యోగ్యమైన జీవన విధానానికి తోడ్పడే కర్మలను నిర్దేశిస్తున్నాయి. అట్టి శుభప్రదమైన కర్మలనే ఆచరిస్తూ తాత్విక చింతనతో జన్మను చరితార్థం చేసుకుంటారు హిందువులు.
హిందూ అంటే?
సంస్కృత వ్యాకరణంలో 'హిమ్' అనే ధాతువుకు పాపము అని అర్థము. 'దూ' అనగా దూషయతి, ఖండయతి. కనుక హిందువనగా పాపరహితుదని అర్థం. సింధు నదికి, హిందూ మహాసముద్రానికి మధ్య భాగంలో నివసించే వారిని హిందువులని, వీరి విశిష్టమైన ఆచారవ్యవహారాలతో కూడిన సంస్కృతిని హిందూ ధర్మమని చెప్పబడింది.
హిందూ ధర్మం అని పిలవడం తప్పా?
తప్పే లేదు. సనాతన ధర్మంగా పిలవబడే మన ధర్మానికి హిందూ ధర్మమనే పేరుతొ పిలవడం తప్పుగా ఎలా భావించ వచ్చు? పేరు గురించి పెద్ద రాద్దాంతం చేసుకోవలసిన పనిలేదు కానీ, మన ఆచార వ్యవహారాలను మరచిపోయి, దిగజారిపోకుండా హిందూ అనే పేరుతొ వ్యవహరించడం దోషమేమీ కాదు.
నేటి ధర్మ ప్రచారకులు ఈ విషయాన్ని గుర్తించాలి. అందుకై మన ప్రాచీన ఆచారాలను, ధార్మిక భావాలను, శాస్త్రాలను పరిరక్షించి రాబోవు తరం వారికి అందించే యోగ్యులైన అనుసంధాన కర్తలు కావాలి.
మతం అన్నా, ధర్మం అన్నా ఒకే అర్థాన్ని సూచిస్తుందా?
మనిషి యొక్క మతి (మనసు)లో కలిగిన భావననే మతమంటారు. వ్యక్తిని ఆలంబనగా చేసుకుని ఉద్భవించినవే మతాలు. మనం అత్యంత ప్రమాణంగా భావించే వేదాలను వ్యక్తులు ఊహించి చెప్పినవి కావు. త్యాగమూర్తులైన ఋషులు తపమాచరించి దర్శించిన సత్యాలను వేదములంటాము. అట్టి వేదములు నిర్దేశించిన మార్గమే ధర్మమార్గం. అందుకే మనది మతం కాదు. సనాతన ధర్మమని గ్రహించాలి. ధర్మమే మనకు ప్రధానం. శాస్త్రం సూచించిన మార్గాన్ని అనుసరించడమే ధర్మం. అట్టి శాస్త్రాన్ని ప్రామాణికంగా అంగీకరించే మన సంస్కృతిలో వ్యక్తిగతమైన ఆలోచనలకు, రాగద్వేషాలకు తావు లేదు.
జై హింద్ 🚩🚩🚩
0 Comments
మీకు edit చేసి ఫొటోస్, వీడియోస్, ఇంకా దెని గురించి అన్నా ఇన్ఫర్మేషన్ కావాలీ అంటే Plz comment చేయండి